Archive for January, 2014
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చిన సందర్భంగా విశాలాంధ్ర మహాసభ రాష్ట్రపతిని పది ప్రశ్నలు అడుగుతోంది:
1) రాష్ట్ర విభజన ప్రక్రియ రాజకీయావసరాల కోసం దుర్వినియోగం కాకుండా భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ప్రత్యేక హక్కులను కల్పించింది. మీరు ఈ హక్కులను సద్వినియోగిస్తారా?
2) రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించబడుతుంది అని డా. అంభేద్కర్ చెప్పారు. ఆదరా బాదరాగా ముందుకు వెళ్తున్న విభజన ప్రక్రియకున్న అత్యవసర పరిస్థితులు ఏంటి?
3) వేర్పాటువాదుల ఆరోపణలు అసత్యం అని శ్రీకృష్ణ కమిటీ నిరూపించింది. అయినప్పటికీ, ఎలాంటి సహేతుక కారణాలు చూపించకుండా రాష్ట్రాన్ని విభజించటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం, తెలుగు ప్రజలకు భారత దేశంపై వ్యతిరేక భావాలు కలిగించే విధంగా లేదా?
4) ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెడితే లోక్ సభ స్పీకర్ కుంటి సాకులతో చర్చ జరగనివ్వలేదు. ఈ అప్రజాస్వామిక పధతులు రాష్ట్ర అసెంబ్లీలకు తప్పుడు సంకేతాలు పంపట్లేదా?
5) మాతృ రాష్ట్రం సమ్మతి లేకుండా రాష్ట్రాల విభజన చెయ్యకూడదన్న సర్కారియా కమిషన్ సిఫారసుతో మీరు ఏకీభవిస్తారా?
6) ఈ మధ్యలో జరిగిన అన్ని రాష్ట్రాల విభజనలలో అసెంబ్లీ తీర్మానం పెట్టటం జరిగింది. అత్యంత వివాదాస్పదమయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా ఆ సాంప్రదాయాన్ని విస్మరించటం ఎంత వరకు సబబు?
7) రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని రాజ్యాంగపరంగా ఏ విధంగా సాధ్యం?
8) హైదరాబాద్ నగర శాంతి భద్రతలపై గవర్నర్ కు ఇచ్చిన ప్రత్యేక హక్కులు రాజ్యాంగ విరుద్ధం కాదా?
9) 371 D&E అధికరణాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని అటార్నీజనరల్ హెచ్చరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు అని పట్టుబట్టటాన్ని మీరు సమర్థిస్తున్నారా?
10) విభజన జరిగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా రాష్ట్రానికి విద్యుత్తు అమ్మాలని నిర్బందించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?