Archive for September, 2013
It is a little late, but I haven't gotten a chance to post my Vijayawada speech. Probably one of the finest, most disciplined, and determined audience I have seen in the last couple of months. At one point drizzle turned into pouring rain. People held nearly 100,000 chairs over their heads to cover themselves, and they refused to leave the grounds. Instead they demanded the guests to speak. It was a memorable scene.
నిరసన పత్రం
గౌరవనీయులు శ్రీ కావూరి సాంబశివరావు
కేంద్ర మంత్రివర్యులు
ఆర్య,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదన అమలయితే అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు నష్టపోతారు. మన రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ఎన్ని విపరిమాణాలకు, విభజనలకు, విద్వేషాలకు, విధ్వంసాలకు, దారి తీస్తుందో మీకు ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.
కేంద్రంలో మంత్రి పదవి చేపట్టక ముందు, తమరే సహీతుకంగా చాటి చెప్పిన సమైక్య వాదనలు ప్రజలు మరిచిపోలేదు. సమైక్యవాద ప్రవక్తగా, ఐక్యతా ఆశాజ్యోతిగా, మిమ్మల్ని నిన్న మొన్నటి వరకు, నెత్తిన పెట్టుకున్న ప్రజలే నేడు ఎందుకు కత్తి దూస్తున్నారో, ఎందుకు దూషిస్తున్నారో మీరు గుర్తించాలి. మీ వర్తమాన ప్రవర్తన, పదవీ వ్యామోహం, గతంలో మిమ్మల్ని అభిమానించిన వారందరిలో మీ పట్ల విముఖతను ఆగ్రహాన్ని పెంచాయి.
దళపతిగా వ్యవహరించిన మిమ్మల్ని బుట్టలో వేసుకుంటే సమైక్య ఉద్యమం చతికిలబడిపోతుందని అంచనా వేసారు ఢిల్లీ పెద్దలు. ఆ కుట్రలు నేడు వమ్ము అయ్యాయి. ఈ రోజు నాయకులు లేకుండానే కోట్లాది సామాన్య ప్రజలు సమైక్య సమరంలో అలుపెరుగని వీరుల్లా పోరాడుతున్నారు.
కాబట్టి కావూరి వారు, ఇప్పటికయినా తమరు అంతరాత్మ ప్రబోధానికనుగుణంగా తక్షణం కేంద్రంలోని మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సమైక్యతకు పాటు పడవలసిందిగా అభ్యర్ధిస్తున్నాం. మీ రాజీనామా ఇతర సహచర తెలుగు కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు మార్గదర్శకం అవుతుంది. రాజీనామా చేసి రాష్ట్ర సమగ్రతను తద్వారా దేశ సమైక్యతను కాపాడండి.
సమైక్య ఉద్యమానికి మీ పెదవి సానుభూతి చాలదు. మీ పదవీ త్యాగం కావాలి. చేయని పక్షంలో ప్రజలు మీలాంటి వారందరికీ రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తారు.
నలమోతు చక్రవర్తి
అధ్యక్షులు
విశాలాంధ్ర మహాసభ
నిరసన పత్రం
గౌరవనీయులు శ్రీ కె. చిరంజీవి
కేంద్ర మంత్రివర్యులు
ఆర్య,
మీతో సహా ఎవరూ కాదనలేని కొన్ని కఠోర వాస్తవాలను క్లుప్తంగా పేర్కొనటం సముచితమనుకుంటున్నాం.
మన రాష్ట్ర విభజన జరిగితే:
- అన్ని ప్రాంతాల మతాల ప్రజలకు ఎప్పటికీ తీరని తీవ్రమయిన కష్ట నష్టాలు వాటిల్లుతాయి.
- దేశ వ్యాప్తంగా ఎన్నో విపరీత పరిణామాలు, విభజనలు, విధ్వంసాలు సంభవిస్తాయి.
- మాతృభాషల వికాసానికి మాత్రమే కాదు, యావత్ దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుంది.
- హింసాయుత ఆందోళనలు, అసత్యాలు, అకృత్యాల ద్వారా అల్పసంఖ్యాకుల స్వార్థ పూరిత ఆకాంక్షలు నెరవేర్చుకోవచ్చన్న ధోరణులు దురాశలు దేశవ్యాప్తంగా ప్రబలి పోతాయి. ప్రజాస్వామ్యం బలి అయిపోతుంది.
- ఈ రాష్ట్ర విభజనను ఏ రూపంలోనైనా పరోక్షంగానైనా దోహదపడే వారెవరయినాసరే, మాతృభాష, మాతృదేశ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు.
మీకు తెలుగు భాషలో నచ్చని పదం “రాజీనామా”, అతి ప్రియమయిన పదం “పదవి” అని ప్రజలు అనుకుంటున్నారు. చీలిక ప్రదేశానికయినా ఏలిక కావాలన్న కోరిక మీకుందేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు.
కాబట్టి ఇప్పటికయినా మేల్కొని తక్షణం కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేస్తున్న కోట్లాది సామాన్య తెలుగు ప్రజల వెంబడి నడవాలని అభ్యర్తిస్తున్నాం.
సమైక్య ఉద్యమానికి మీ పెదవి సానుభూతి చాలదు. మీ పదవీ త్యాగం కావాలి. చేయని పక్షంలో ప్రజలు మీలాంటి వారందరికీ రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తారు.
కార్యవర్గ సభ్యులు
విశాలాంధ్ర మహాసభ
యూ.పి.ఏ. జూలై 30 2013న మన రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో విశాలాంధ్ర మహాసభ తెలుగు జాతి ఐక్యత కోసం ప్రజల్లో చైతన్యం కలిగించటానికి రాష్ట్ర వ్యాప్త సమైక్యత యాత్రకు ఆగష్టు 6, 2013న శ్రీకారం చుట్టింది. మొదటి దశలో రాయలసీమ ప్రాంతంలో, రెండవ దశలో కోస్తా ప్రాతంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే, మూడవ దశలో నైజాం ప్రాతంలో పర్యటించాలన్నది మా కోరిక. సమైక్యత యాత్ర కోస్తా, రాయలసీమలోని పదమూడు జిల్లాలలో మూడు వేల కిలోమీటర్లు దూరం సాగింది. ప్రజలు ఊరు ఊరు వాడ వాడ ముక్త కంఠంతో కోరుకుంటున్నది 23 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉండే సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రము. దీనిలో ఎట్లాంటి బేరసారాలకి తావులేదని స్పష్టంగా చెపుతున్నారు ప్రజలు.
తెలుగు జాతి ఐక్యత ఒక పవిత్ర లక్షంగా మన పెద్దలు భావించారు కాబట్టే 1956లో మన రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత ప్రజలు కర్నూల్ రాజధానిగా ఉండాలని కోరారు. కోస్తా ప్రాంత ప్రజలు పెద్ద మనసుతో కర్నూల్ ని రాజధానిగా అంగీకరించారు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు, హైదరాబాద్ రాజధానిగా ఉండటానికి అనుకూలమయిన నగరం. వెనుకబడ్డ ప్రాంతమయినప్పటికీ రాయలసీమ ప్రజలు కర్నూలు రాజధాని వదులుకొని, సమైక్య తెలుగు రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ఉండటానికి అంగీకరించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి మార్గం సుగుమం చేయటానికి బూర్గుల రామకృష్ణ రావు ముఖ్యమంత్రి పదివిని త్యజించారు. అన్ని ప్రాంతాల ప్రజలు నాయకుల నిస్వార్ధ త్యాగాల ఫలితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం.
దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న నూరు సంవత్సరాల చరిత్రను మరిచిపోయి, మన రాష్ట్రంలోని మూడు ముఖ్య రాజకీయ పార్టీలు తెలుగు జాతికి వెన్నుపోటు పొడిచాయి. ముందు రెండు కళ్ళ సిద్ధాంతం అన్న తెలుగు దేశం పార్టీ, తరువాత ఒంటి కన్ను సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. ఈనాడు ఆ పార్టి అంధకారంలో మునిగిపోయింది. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సెంటిమెంట్ పై మాకు గౌరవముంది అని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వచ్చింది. ఇన్ని రోజులు గోడ మీద పిల్లిలా కూర్చున్న ఆ పార్టీ, యూ.పి.ఏ ఇక రెండు మూడు రోజుల్లో విభజనకు నిర్ణయం తీసుకుంటుంది అనగా గోడ మీద నుంచి దూకి ఇప్పుడు సమైక్యం అంటుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని బ్రిటిషు వారు స్తాపించారు. బ్రిటిష్ వాళ్ళ “విభజించు పాలించు” సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తే తమకు ఎక్కువ వోట్లు, సీట్లు వస్తాయనే ఆలోచనే తప్ప రాష్ట్ర, దేశ ప్రయోజనాలపై దూరదృష్టి లేదు.
రాజకీయ పార్టీలు తమని మోసం చేశాయని గమనించిన ప్రజలు పార్టీలకి అతీతంగా రోడ్లేక్కారు, ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి నాయకులు లేరు. మన నాయకుల లాగ ఉద్యోగాలు, నిధులు, నీళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు జనాలు. ప్రజలు ఒకే ఒక లక్షంతో ముందుకు సాగుతున్నారు- ఆ లక్షం సమైక్యాంధ్ర!
అయితే ప్రజలకు తమ లక్షం స్పష్టంగా ఉన్నప్పటికీ, వాళ్ళు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా అడిగింది ఉద్యమ తక్షణ కర్తవ్యాలు ఏంటి అని, ఈ ఉద్యమాన్ని లక్ష్య సాధన దిశగా ఎట్లా తీసుకెళ్ళగలం అని. ఉద్యమానికి ఒక రోడ్ మ్యాప్ తీసుకు రావాలి అన్నది వాళ్ళ భావన.
సమైక్యాంధ్ర ఉద్యమ తక్షణ కర్తవ్యం సమైక్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న కేంద్ర మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.ఏ ల రాజీనామాలు. మన ప్రజా ప్రతినిధులు చెప్పే కుంటి సాకులు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. డిసెంబర్ 9 2009 ప్రకటన వచ్చి మూడు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో సమైక్యానికి కట్టుపడి ఉన్న మంత్రులు, ప్రతినిధులు సాధించింది శూన్యం. పులుల్లా గాండ్రించే మన నాయకులు ఇవ్వాల్టికి కూడా సోనియా గాంధీ గుడ్లు ఉరుమితే పిల్లుల్లా అయిపోతున్నారు. వీరు తెలుగు జాతి ఐక్యత కొరకు పోరాడుతారనుకోవటం అవివేకం. కేంద్రంలో యూ.పి.ఏ. ప్రభుత్వం బొటాబొటి మెజారిటీతో నడుస్తుంది. సమైక్యానికి కట్టుపడి ఉన్నామని చెపుతున్న మంత్రులు, ఎం.పి. లు రాజీనామా చేస్తే కేంద్రంలో రాజకీయ సంక్షోభం వస్తుంది. ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది. యూ.పి.ఏ. తలపెట్టిన దుష్కార్యాన్ని ఆపటానికి ఇంతకు మించిన మార్గం లేదు. మన రాష్ట్రానికి చెందినా మెజారిటీ ప్రజా ప్రతినిధులు లేని చట్ట సభలలో రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవటం అసాధ్యం. అలా చేయటానికి కేంద్ర ప్రభుత్వం సాహసిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది.
సమైక్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న కేంద్ర మంత్రులకి ఎం.పి. లకి ఒక గమనిక. మీ నియోజకవర్గ ప్రజలు కెసిఆర్ కన్నా కూడా మిమ్మల్ని ఎక్కువగా ద్వేషిస్తున్నారు. కళాకారులు రాసే గేయాలలో విమర్శలు, దూషణలు విభాజనవాదుల కన్నా సమైక్యవాద మంత్రులు, ప్రజా ప్రతినిధుల మీద ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఉదాహరణకు ఏలూరులో ఒక రోడ్డుపై ఉన్న ఫ్లెక్సి బ్యానర్ పై ఈ విధంగా రాసారు: “గాండ్రించని పులులెందుకు, గర్జించని సింహాలెందుకు, ఘీంకరించని ఎనుగులేందుకు, బుసకొట్టని నాగులెందుకు, గొంతు విప్పని నాయకులెందుకు?ఎందుకు? ఎందుకు?”
లగడపాటి రాజగోపాల్ వంటి సమైక్యవాద నాయకులు ఉద్యమాన్ని చిన్నబుచ్చే మాటలు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి. ఆయన ఉపయోగించబోయే బ్రహ్మాస్త్రం ఏంటో తెలియదు కాని అది పిచ్చుక పైన కూడా పనిచేయదని ప్రజలకి తెలుసు. మీరు డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తరువాత మీ తప్పిదాలు గ్రహించి మీ ధోరణి మార్చుకుంటారని అనుకున్నాము. ఒక పక్క విభజనవాదులు రోడ్లేక్కి ఆందోళనలు చేస్తుంటే , గత మూడు సంవత్సరాలుగా మీరు ఏసి గదుల్లో కూర్చుని రెండు వారాలకి ఒక సారి మీడియా వాళ్ళని మీ దగ్గరకి పిలింపించుకొని టివిలలో రంకెలు వేయటం ద్వారా ఉద్యమాన్ని నడిపిస్తున్నామని మీరనుకున్నారు. ఇక నైనా యూ.పీ.ఏ. తీసుకున్న నిర్ణయానికి నైతిక భాద్యత వహించి మీ రాజీనామా ద్వారా రాష్ట్ర ప్రజలికి క్షమాపణలు చెప్పండి. ఈ విజ్ఞ్యప్తి అందరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎం. పి. లు, ఎం. ఎల్. ఏ. లకు కూడా వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్.టి.సి. కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కోట్లాది మంది సామాన్య ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగులకి నెల జీతాలు రాని పరిస్థితి. సమ్మె మూలంగా ఆర్.టి.సి. ఉద్యోగులకి జీత భత్యాల నష్టమే కాకుండా సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. విద్యార్థులు ఉపాధ్యాయులు చదువులని పక్కన పెట్టి సమైక్యాంధ్ర కొరకు రోడ్డెక్కారు. ఉద్యోగుల, కార్మికుల, విద్యార్ధుల త్యాగాలకు తెలుగు జాతి ఎప్పటికి రుణపడి ఉంటుంది.
చివరికి బిచ్చగాళ్ళు కుష్టు రోగులు కూడా జే ఏ సి లు పెట్టుకొని ఉద్యమ బాట పట్టారు. కాని మన మంత్రులు, ఎం.పి. లు, ఎం.ఎల్.ఏ. లు మాత్రం జిడ్డులా పదవులని పట్టికొని వేలాడటం చాల విడ్డూరం. పదవుల కొరకు మీరు తెలుగు జాతి ఐక్యతను తాకట్టు పెడితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నాయకులారా చరిత్ర హీనులు కాకండి, రాజీనామాలు చేయండి ఉద్యమంలో మమేకం కండి.
ఉద్యమ తక్షణ కర్తవ్యమ్ ప్రజా ప్రతినిధుల రాజీనామా అయితే, ఉద్యమ లక్ష సాధనకి ఒక ఐక్య కార్యాచరణ అత్యవసరం. రాష్ట్రంలో వేలాది జే.ఏ.సి. లు ఉన్నాయి. ఈ సంస్థలు చేసే కార్యక్రమాల మధ్య సమన్వయము తీసుకు రావటం చాల ముఖ్యం. ఈ సంస్తలన్నిటిని ఒకే గొడుకు కిందకి తీసుకు రాలేము, తీసుకు వచ్చే ప్రయత్నం కూడా చేయకూడదు. ఈ ఉద్యమం ప్రత్యేకత నాయకులు లేకపోవటం. దానిని మనం స్వాగతించాలి, అలాగే కొనసాగించాలి. అయితే వచ్చే రెండు మూడు నెలల పాటు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏమి చేస్తే కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావచ్చు అని అలోచించి ఒక క్యాలెండర్ తయారు చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ ఐక్య కార్యాచరణని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జే.ఏ.సి. లని సమన్వయపరిచి అందరం ఒకే తాటిపై నడవటానికి కృషి చేయాలి.
నలమోతు చక్రవర్తి
అధ్యక్షులు
విశాలాంధ్ర మహాసభ