Archive for May, 2013
Dear All: Here is the article published in Andhra Jyothy a couple of days ago, written by Visalandhra Mahasabha General Secretary Parakala Prabhakara garu.
వేర్పాటువాదాన్ని
శాశ్వతంగా సాగనంపాలి
విశాలాంధ్ర మహాసభ రాష్ర సమైక్యతను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ప్రధానంగా మేధోపరమైనది. మేము మన రాష్ట్రం ఎందుకు ఒకటిగా ఉండాలి అనే విషయం పై రాస్తున్నాము. రాష్ట్ర విభజనను కోరేవారు చేస్తున్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రకటనలు, అసత్యాలనీ, అర్ధసత్యాలనీ, వక్రీకరణలనీ నిరూపిస్తూ ప్రచురణలు, పుస్తకాలు వెలువరిస్తున్నాము. ప్రదర్శనలు, మీడియా వర్క్ షాపులు నిర్వహిస్తున్నాము. టెలివిజన్ చర్చల్లో పాల్గొని మా వాదనని వినిపిస్తున్నాము. సోషల్ మీడియా లో మా అభిప్రాయాలు ప్రకటిస్తున్నాము. వేర్పాటువాదుల అసమంజస ప్రవర్తనని, అసంబద్ధ వాదనలని, అప్రజాస్వామిక వైఖరిని, వారి బలప్రయోగాన్ని, హింసాత్మక ధోరణుల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.
మాకు ఏ ప్రాంతం పట్ల అయిష్టత లేదు. ఏ ప్రాంత ప్రజల పట్ల ద్వేష భావం లేదు. మేము వ్యతిరేకించేది వేర్పాటు వాదాన్ని. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేర్పాటువాదులను. మేము వ్యతిరేకించేది కేవలం తెలంగాణా వేర్పాటు వాదులను మాత్రమే కాదు. రాయలసీమ వేర్పాటువాదులను, కోస్తా వేర్పాటువాదులను కూడా అంతే పట్టుదలతో వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తాం. విభజన వాదం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చరిత్ర ఎరిగిన వారు ఎవ్వరూ అనరు. 1969 లో తెలంగాణలో వేర్పాటు వాదులు విజ్రుంభిస్తే, 1972 లో కోస్తా రాయలసీమల్లో పెద్ద ఎత్తున వేర్పాటు ఆందోళన జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరో సారి జరుగుతోంది. అంతే.
కోస్తా రాయలసీమల్లో విభజన వాదం తలెత్తి నపుడు అంతకు మూడు సంవత్సరాల మునుపు ఆందోళన చేసిన తెలంగాణ వేర్పాటవాద నాయకులు మిన్నకుండడం చూస్తే, రాష్ట్ర విభజన వాంఛనీయత పట్ల వారికి ఏమాత్రం నిబద్ధత లేదని ఇట్టే అవగతమవుతుంది. ‘దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం’ అన్నది కేవలం కట్టుకధ అనీ అతిశయోక్తి అలంకార ప్రయోగమని తెలుస్తుంది. ఈ ఆందోళనలు కేవలం వారి రాజకీయ వ్యూహాలలో, బేరసారాలలో, లావాదేవీలలో భాగాలు మాత్రమే అనేది తేట తెల్లమవుతుంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం అభం శుభం తెలియని సామాన్య ప్రజలను అబద్ధాలతో, అర్ధసత్యాలతో, వక్రీకరణలతో రెచ్చగొట్టి, వారిలో ప్రాంతీయ విద్వేషభావం ప్రజ్వలింపచేసి, వారిని వేర్పాటు వాదం వైపు మళ్లించే ఈ నాయకుల మీద మా పోరాటం.
ఇటువంటి స్వార్ధ నాయకుల మాటలు విని, అవి యదార్ధమని నమ్మి, రాష్ట్ర విభజనే మార్గాంతరం అని అనుకుంటున్న సామాన్య ప్రజల పట్ల మాకు వ్యతిరేకత లేదు. వారికి వాస్తవాలు తెలియచేసి, సమైక్యతా వాదాన్ని వినిపించి, వారి ఆలోచనలనులను మార్చి, రాష్ట్ర సమైక్యతను కాపాడాలన్నది మా ఆశయం. వారి మనసులను గెలుచుకోవడం మా లక్ష్యం. మూడు ప్రాంతాలోనూ ప్రజల మస్తిష్కాలలోనుంచి సంపూర్ణంగా వేర్పాటువాదాన్ని ఆనవాళ్ళు కూడా లేకుండా తొలగించడం మా ఉద్దేశ్యం. వోట్ల కోసం కల్లబొల్లి మాటలతో వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతూ నాలుక భుజాన వేసుకుని తిరిగే మాటకారి రాజకీయ నాయకులకు, వారి పార్టీలకు ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ ఆదరణ లభంచని వాతావరణాన్ని నిర్మించడం మా ధ్యేయం.
మా ఆశయ సాధనకున్న అవరోధాలు చాలా పెద్దవి.
మా మాట సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఈ నాయకులు, వారి తాబేదార్లు అనేక అడ్డంకులు కలిగిస్తున్నారు. మేము ఎప్పుడు సభ పెట్టినా దాన్ని భగ్నం చేయడం, మా మీద దాడులు చెయ్యడం, మమ్మల్ని కొట్టడం, మా పుస్తకాలను తగుల బెట్టడం వారికి పరిపాటి అయిపోయింది. మేము చెప్పే మాట జన సామాన్యానికి చేరితే, వీరి ఆటలు సాగవు అని వీరి భయం. ఒక చిన్న పుస్తకానికి, ఒక ఉపన్యాసానికి, ఒక పత్రికా ప్రకటనకి, ఒక ప్రదర్శనకి, ఒక బహిరంగ చర్చకి భయపడే ఉద్యమం కూడా ఒక ఉద్యమమేనా? వాదనలో పసలేని వారే దౌర్జన్యాలకి దిగుతారు అన్నదానికి తెలంగాణ వేర్పాటువాదుల హింసాత్మక ప్రవర్తన కంటే రుజువు ఏమి కావాలి?
‘రుజువులు లేని ఉద్యమం : తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు వక్రీకరణలు’ అన్న పుస్తకంలో ఆందోళనకారులు రాష్ట్ర విభజనకు చూపిస్తున్న కారణాలలో నిజం లేదని సమగ్రంగా వివరించాం. మా పుస్తకం ఎంత శక్తివంతమైనదో వేర్పాటువాదులు అసహనపూరిత ప్రతిచర్యలే సాక్ష్యం. మేము ఇంగ్లిష్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన నాటి నుండి ఈ నాటి వరకు వేర్పాటువాదులు అందులో మేము రాసిన ఒక్క విషయాన్ని కూడా పూర్వపక్షం చెయ్య లేకపోయారు. ఒక్క అంశాన్ని కూడా తప్పు పట్ట లేకపోయారు. పుస్తకం మీద జరిగిన ప్రతి చర్చలోనూ మమ్మల్ని ఆడిపోసుకున్నారు; మాది దురహంకార మన్నారు; మేము రెచ్చగొడుతున్నామన్నారు; మేము తెలంగాణ ప్రజల మనోభావాలను అగౌరవ పరుస్తున్నామన్నారు; ప్రజాభిప్రాయం పట్ల మాకు గౌరవం లేదన్నారు; ఇంతమంది అవునంటున్నది మేమెలా కాదనగల మన్నారు; మరెన్నో మాటలు మిగిలారు. కొంతమంది సోషల్ మీడియా లో మా మీద ‘సింగిడి’ కవులను మించిపోయి పచ్చి బూతులు కూడా ప్రయోగించారు. వ్యక్తిగత దూషణలకు హద్దూ పద్దూ లేకుండా పోయింది.
కాని ఒక్కరంటే ఒక్కరు ఇదిగో ఈ పుటలో ఇక్కడ ఈ దోషం ఉంది అని మాత్రం ఎత్తి చూప లేకపోయారు. మా గణాంకాలను తప్పు పట్టలేకపోయారు. మా తర్కాన్ని వేలెత్తి చూపలేకపోయారు. మేము ఇచ్చిన భాష్యానికి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేకపోయారు. మా విశ్లేషణకు సమాధానం చెప్పలేకపోయారు.
మా భావ ప్రకటనా స్వేచ్ఛ మీద సాక్షాత్తు ప్రెస్ క్లబ్ లో దాడి జరిగితే, పాత్రికేయులే దుండుగులుగా మారి మా పుస్తకాన్ని తగలబెడితే, దేశవ్యాప్తంగా లబ్దప్రతిష్టులైన మన పౌర హక్కుల సంఘాల పెద్దలు ఒక్కరంటే ఒక్కరికి ఆ దుశ్చర్యను ఖండించడానికి నోరు రాలేదు. హక్కుల పరిరక్షకులుగా దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రతిష్టను ఇంత చవకగా వారు పోగొట్టుకుంటారని మేము ఊహించలేదు.
మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలందరి పక్షాన మాట్లాడుతున్నట్టు వేర్పాటువాద నాయకులు మనల్ని నమ్మమంటారు. కాదు వారు కేవలం రాష్ట్ర విభజనను కోరుకునే వారి పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారని యావత్ తెలంగాణా ప్రాంత ప్రజానీకం పక్షాన కాదనీ మేమంటున్నాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలలోనూ విభజన వాదులున్నారు; అలాగే మూడు ప్రాంతాలలోనూ సమైక్య వాదులున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సారి విభజన వాదం బిగ్గరగా వినపడుంది. బిగ్గరగా వినపడినంత మాత్రాన బలంగా ఉన్నట్టు లెక్కకాదు. ఈవాల్టికి కూడా, వేర్పాటు వాదులు ఇంత బీభత్స వాతావరణం సృష్టించినా, తెలంగాణాలో విశాలాంధ్రవాదం బలంగా ఉంది. విశాలాంధ్ర మహాసభలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు చాలా ఎక్కువ మంది సభ్యులుగా ఉండడమే దీనికి ప్రబల తార్కాణం.
తమ వాదన బలంగా ఉందనడానికి ఈ మధ్య జరిగిన కొన్ని ఉపఎన్నికల ఫలితాలు తప్ప వేర్పాటు వాదులకు మరొక ఆధారం లేదు. 1969 నుంచి 2009 దాక తెలంగాణలో – నాలుగు దశాబ్దాల పాటు — విభజన వాదానికి ఎక్కడా పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టలేదు. భారతీయ జనతా పార్టీ, ఇంద్రారెడ్డి పార్టీ, దేవేందర్ గౌడ్ పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితిలు ఎంత ఆయాస పడ్డా వారు సాధించిన ఎన్నికల ఫలితాలు అంతంత మాత్రమే అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మొన్న పరకాల ఉపఎన్నికలో నెగ్గడానికి తెరాసకి తలప్రాణం తోకకొచ్చింది. పట్టుమని పదివేలమంది కూడా లేని సమీకరణని చూపించి దాన్నే ‘మిలియన్’ మార్చ్ అనుకోమన్నప్పుడే వేర్పాటు వాదులకున్న ప్రజాబలమెంతో అర్ధమయ్యింది. బుకాయింపులకు, దబాయింపులకూ కూడా ఒక అడ్డూ ఆపూ ఉంటాయి.
విభజనవాద సమైక్యవాద భావాజాలాల మధ్య ఎప్పుడు సంఘర్షణ జరిగినా సమైక్యవాదమే విజయం సాధించింది. ఈ సారి కూడా సమైక్యవాదమే గెలుస్తుందని మా విశ్వాసం. తెలంగాణలో మా సభలను సజావుగా జరుపుకుని అసలు విషయాలను ప్రజలకు వివరిస్తే ఇప్పుడున్న కొద్ది బలం కూడా విభజన వాదులు కోల్పాతారు. అందుకే మమ్మల్ని ప్రజలలోకి వెళ్ళకుండా మా వాదనను ప్రజలకు చేరకుండా వారు మమ్మల్ని శతవిధాలా అడ్డుకుంటున్నారు. మా వాదన అంటే వారికి అభద్రతా భావం. లేకపొతే వారు ఆ పని చెయ్యరు.
మాతో బహిరంగ చర్చలకు అడపాదడపా వేర్పాటు వాదులు సవాళ్ళు విసురుతూ ఉంటారు. కాని సమయం వచ్చేటప్పటికి పత్తా లేకుండా పోతారు. వారు విసిరిన ప్రతి సవాలునూ మేము స్వీకరించాం. చర్చకు సిద్ధమయ్యాం. గతంలో ఒక మాజీ మంత్రి చర్చకు పిలిచి ఆయన అనుచరులతో మా మీద దాడి చేయించి ఉడాయించారు. నిన్నకాక మొన్న ఒక విభజనవాద శాసన సభ్యుడు చర్చకు రమ్మని సవాలు విసిరారు. మేము స్వీకరించాం. ఇవాల్టి వరకూ అతగాడు మళ్ళీ కిమ్మనలేదు.
భావజాల వ్యాప్తికి అప్రజాస్వామిక మూకలు సృష్టించే అడ్డంకులను అదృష్టవశాత్తు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాను రాను బలహీన పరుస్తోంది. మేము ఇంటర్నెట్ లో పెట్టిన ‘రుజువులు లేని ఉద్యమం’ పుస్తకం సాఫ్ట్ కాపీ కొన్ని వేలు డౌన్ లోడ్లు అవుతున్నాయి. పుస్తకాల ప్రతులు కావలసిన వారు సంప్రదించాల్సిన ఈమెయిలు అడ్రసు, ఫోన్ నెంబరు సోషల్ మీడియాలో ప్రకటించాం. రోజుకు కొన్ని వందల మంది పుస్తకాల కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఎడతెరిపి లేకుండా పుస్తకాలు కావాలని ఎస్ఎంఎస్ లు, ఈమెయిల్సు వస్తున్నాయి. మా వాదన, మా మాట, మేము చెప్పే వాస్తవాలు ప్రజలలోకి లోతుగా, నిశ్శబ్దంగా వెడుతున్నాయి.
మేము వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తే దాన్ని తెలంగాణ ప్రజానీకానికి మేము వ్యతిరేకమన్నట్లుగా వేర్పాటువాదులు చిత్రీకరిస్తున్నారు. విభజన వాదుల అబద్ధాలను ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలను అబద్దాలాడేవాళ్ళు అంటారా అని తిరగేస్తున్నారు. తెలంగాణ లోని సామాన్య ప్రజలకు సమైక్యవాదులను శత్రువులుగా చూపించాలని వీరి ప్రయత్నం.
వేర్పాటువాదాన్ని సమర్ధించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంత వరకూ సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇదే ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడ లేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటి పారిపోతుంది. తెలంగాణలో ఉన్న అసంఖ్యాక విశాలాంధ్ర వాదులు ఈ ఎత్తుగడను, ఈ అభూత కల్పనను ఛేదించాలి. ముసిరిన ఈ తిమిరంతో సమరం చేయాలి.
ఇంతకు ముందూ ఇప్పుడూ విశాలాంధ్ర కోరిన వారు, కోరుతున్న వారూ నిఖార్సయిన తెలంగాణ ప్రాంత శ్రేయోభిలాషులు అనడానికి రావి నారాయణరెడ్డి తో మొదలుకొని పీవీ నరసింహారావు వరకూ, దేవులపల్లి రామానుజరావు నుంచి నర్రా మాధవరావు వరకూ అనేక మంది నిష్ఠ గల నాయకులు మనకు ఉదాహరణలుగా నిలబడతారు. కాని ఇవాళ రాష్ట్ర విభజన కోరే నాయకులందరూ తెలంగాణ హితైషులు అనడానికి వారి రాజకీయ చరిత్రలలో దాఖలాలు బహు తక్కువ.
తెలంగాణ మీద అభిమానానికి విభజన వాదం గీటు రాయి కాదు. విభజన వాదం వేరు, తెలంగాణ మీది మమకారం వేరు. ఈ రెండిటినీ ఒకటిగా చూపించి పబ్బం గడుపుకోవాలని వేర్పాటువాద నాయకుల ప్రయత్నం. అయితే ఈ రెండింటికీ వైరుధ్యం లేదని, విశాలాంధ్రలో మన ప్రాంత ప్రయోజనాలు సురక్షితమని తెలంగాణ ప్రాంతంలో ఉన్న అసంఖ్యాక విశాలాంధ్ర వాదులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి సంకోచించకుండా ధైర్యంగా ఇక ముందుకు రావాలి. చరిత్ర, ఆర్ధిక గణాంకాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సహజీవన పరంపర వారి వాదనకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు’ అన్న రావి నారాయణ రెడ్డి గర్జన తెలంగాణాలో విశాలాంధ్రవాదుల మంత్రం కావాలి.
తెలంగాణా ప్రయోజనాలకి తెలంగాణ వేర్పాటువాదులు, రాయలసీమ ప్రయోజనాలకి ఆ ప్రాంతానికి చెందిన విభజనవాదులు, కోస్తా ప్రయోజనాలకి అక్కడ విభజనవాదం వినిపించేవారు గుత్తేదార్లుగా చెలామణీ అయ్యే క్షుద్ర రాజకీయ క్రీడకి తెర దించాలి. మూడు ప్రాంతాలలో ఉన్న సమైక్య వాదులంతా ఉదాసీనతను వీడి క్రియాశీలకంగా పనిచేస్తే విభజన వాద భావజాలాన్ని తెలుగు నేల నుంచి శాశ్వతంగా సాగనంపగలుగుతాం.
డా. పరకాల ప్రభాకర్
ప్రధాన కార్యదర్శి, విశాలాంధ్ర మహాసభ