Archive for July, 2012
ఈ రోజు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ కి విశాలాంధ్ర మహాసభ హాజరయ్యింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మా వాదనను వినిపించే అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చిన మీదట మా సభ్యులం సమావేశానికి హాజరయ్యం. పిలవని పేరంటానికి మేము వెళ్ళలేదు.
ఇరవై నుంచి ముప్ఫై నిముషాలు అడ్డం పడకుండా అంతరాయం కలిగించకుండా మా మాట చెప్పే అవకాశం ఇస్తామని పదే పదే మాకు చెప్పి అనేక సార్లు మాకు ఫోన్లు చేసాక మేము అక్కడికి వెళ్ళాం.
మా తరఫున డా పరకాల ప్రభాకర్ తన ఉపన్యాసం ప్రారంభించగానే అక్కడ ఉన్న వారు అడ్డుతగలడం మొదలుపెట్టారు.
విభజనకు అనుకూలంగా వారు ఒక కారణం చెపితే మేము కలిసి ఉండడానికి వందకారణాలు చెపుతామని, వారు వంద చెపితే మేము వెయ్యి చెపుతామని, వారు వెయ్యి చెపితే మేము లక్ష చెపుతామని విశాలాంధ్ర మహా సభ ప్రధాన కార్యదర్శి డా పరకాల ప్రభాకర్ ఆ సమావేశం లో సవాలు చేసారు.
తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర సమైక్యతను కోరుకునే వాళ్ళు లక్షలాదిగా ఉన్నారని, దానికి నిదర్శనం విశాలాంధ్ర మహాసభ లో ఉన్న శ్రీయుతులు నర్రా మాధవరావు (సాతంత్ర్య సమరయోధులు), కుమార్ చౌదరి యాదవ్, శ్రీనివాస రెడ్డి, నలమోతు చక్రవర్తి, శ్రీమతి సుగుణమ్మ(స్వాతంత్ర్య సమరయోధులు) లు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో అనేక మంది ఇవాల్టి సభలో పాల్గొన్నారు. విశాలాంధ్ర కోరే ఈ తెలంగాణ ప్రముఖుల కన్నా విభజన కోరే వారికి తెలంగాణా పురోగతి పట్ల అధికంగా ఉన్న నిబద్ధత ఏమిటో వారు సమాధానం చెప్పాలి అని విశాలాంధ్ర మహాసభ ప్రశ్నించింది.
తెలంగాణ ప్రాంతం లో విశాలాంధ్ర వాదుల నోరునోక్కే ప్రయత్నం మానుకోవాలి.
పౌర హక్కులను కాపాడతామని చెప్పుకునే వారు, స్వాత్రంత్ర్య సమరయోధులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్న సభలో మా వాదనను చెప్పడానికి అడ్డుపడడం చాల విచారకరం. వారెవరూ మా అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు మాకు ఉన్నదని మా వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి ముందుకు రాక పోవడం చాల గర్హనీయం.
వీరందరికీ విశాలాంధ్ర మహా సభ ఒక విజ్ఞప్తి చేస్తున్నది.
ఇప్పటికయినా ప్రజాస్వామ్య వాతావరణం లో ఒక చర్చ చేపట్టండి. విభజన వాదన వక్రీకరణల మీద, అభూత కల్పనల మీద, అసత్యాల మీద అర్ధ సత్యాల మీద ఆధార పది సాగు తున్న ఆందోళన అని మేము నిరూపిస్తాం. రాష్ట్ర విభజన ఎందుకు జరగాలో వారు చెప్పవచ్చు.
మా నోరు నొక్కడంతో వారి వాదన లో బలం లేదు అని వారు చెప్పకనే చెప్పినట్టు అయింది.
విశాలాంధ్ర మహాసభ అటువంటి చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం.
రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు మాకు ఇచ్చిన మాట, హామీ నిలబెట్టుకోనందువల్ల, మూకుమ్మడిగా లేచి మాట్లాడుతూ మాకు అంతరాయం కలిగించడం వల్ల, విభజన కు అనుకూలంగా మాట్లాడ మని మమ్మల్ని ఒత్తిడి చేయడం వల్ల మేము సమావేశం నించి నిష్క్రమించాము.
నలమోతు చక్రవర్తి
అధ్యక్షులు, విశాలాంధ్ర మహాసభ